అధికార పార్టీ నిర్వాకంపై బత్యాల ధ్వజం
- EDITOR

- Mar 10, 2023
- 2 min read
మండళి ఎన్నికలలో వైసిపి బరితెగింపు - భారీగా నకిలీ ఓట్లు - అధికార పార్టీ నిర్వాకంపై బత్యాల ధ్వజం

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
శాసనమండలి ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం బరితెగింపుకు దిగి అరాచకాలను సృష్టిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి బత్యాల చెంగలరాయుడు వైసిపి అరాచకాల పైన ధ్వజమెత్తారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయని మండళి అవసరం లేదని, మండళిపై రూపాయి ఖర్చు కూడా దండగేనని గతంలో 2022 జనవరి 28 న వ్యాఖ్యలు చేసిన జగన్ మోహన్ రెడ్డి నేడు అదే మండళి ఎన్నికలలో నకిలీ ఓట్లు, దాడులతో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. జగన్ మాయాజాలంతో కళాశాల మెట్లెక్కని వారంతా పట్టభద్రులయ్యారని ఆరోపించారు. తిరుపతిలో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని.. నెహ్రూ నగర్ లోని వైసీపీ కార్యాలయం చిరునామాతో 30 మంది నకిలీ పట్టభద్ర ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. రాఘవేంద్ర నగర్ లోని 7/18 ఇంటి నెంబర్ తో 20 ఓట్లు, యశోద నగర్ లోని ఓ ఖాళీ స్థలంలో 10 ఓట్లు, బూతు నుంబర్ 228 లో చదువులేనివారు, ఒకే స్టాండు లోని 61 మంది ఓటర్లుగా నమోదయ్యారని అన్నారు. బూతు నంబరు 229 అనంతవీధిలో 50, చింతలచేను లోని బూతు నంబరు 223 లో 22 మంది పట్టభద్ర ఓటర్లుగా నమోదైనట్లు వివరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు లో వైసీపీ నేత నడుపుతున్న డిగ్రీ కళాశాలలో 27 బోగస్ ఓట్లు నమోదు అయ్యాయని తెలిపారు. చిత్తూరు కానుక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ధనుంజయ యాదవ్ ను కిడ్నాప్ చేసేందుకు వైసిపి శ్రేణులు తెగబడ్డారని ఆరోపించారు. ఓ సాధారణ అధికారి ఆర్ జె డి ప్రతాపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణామండలి డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ కడప ఇంచార్జి పదవులు పొందారని.. ఆయన సతీమణి కల్పలత రెడ్డి 2021 లో కృష్ణ గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అయ్యారని.. వారు ప్రస్తుత రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించడం కోసం రంగంలోకి దిగారని ఆరోపించారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో వైసీపీ మద్దతుతో పోటీ చేస్తున్న ఎం.వీ రామచంద్రారెడ్డిని గెలిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని.. కేవలం ఎన్నికల కోసమే ఆర్జెడిని కడప ఇంచార్జిగా నియమించడం జరిగిందని., బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాఠశాల విద్య అధికారులతో అధికారిక సమావేశాల పేరుతో అంతర్గతంగా ఎన్నికల సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 17వ తేదీన అనంతపురం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను కలిపి విందు ఏర్పాటు చేస్తే అడ్డుకున్న విద్యార్థి సంఘాల నేతల పైన కేసులు పెట్టారని అన్నారు. విశాఖపట్నంలో ప్రసాద్ రెడ్డి వీ.సీ స్థాయి మరిచి అన్ని విలువలు వదిలేసి బడితెగించారని ఆరోపించారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలు ప్రసాద్ రెడ్డిదే కీలకపాత్ర అని.. అభ్యర్థులపై వర్సిటీ విద్యార్థులతో సర్వే చేయించారని, ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులతో వర్సిటీలోనే వ్యూహ సమావేశాలు నిర్వహించారని అన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన ఆయన ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ గెలుపు కోసం యూనివర్సిటీలోనే సమావేశం నిర్వహించారని అన్నారు.ఫిబ్రవరి 19వ తేదీన ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్లు, సెక్రటరీలు, ప్రిన్సిపాల్ లకు ఏయూ రిజిస్టర్ పేరిట ఆహ్వానాలు పంపి విందు ఏర్పాటు చేశారని.. ఆ విందులో వై.వి సుబ్బారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, ఇతర నాయకులతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ కు ఓట్లు వేయాలని అడగడం దారుణమని అన్నారు. అధికార పార్టీ అభ్యర్థి తరపున బహిరంగంగా పాఠశాలల్లో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా ప్రత్యర్థ్య అభ్యర్థులను, వారి వెంట నడిచే ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. అధికారం చేతిలో ఉంటే ఎన్నికలు జరగకుండానే పదవులు ఎలా సొంతం చేసుకోవాలో వైసీపీకి తెలిసినంతగా ఎవరికి తెలియదని అన్నారు. నిరుద్యోగులు జగన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదని తెలుసుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ రోజునే పోలీసు నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు దేహదారుధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతోనూ, గ్రామాలలో వాలంటీర్లతోనూ మండళి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికలను ప్రహసనంగా మార్చారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు ఇది పరాకాష్ట అని, ప్రజాస్వామ్య వ్యవస్థలో బోగస్ ఓట్లను ఏరివేయాలని డిమాండ్ చేశారు. వీటన్నిటి పైన స్పష్టమైన ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు గన్నె సుబ్బ నరసయ్య నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అనసూయమ్మ, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రేవూరి వేణుగోపాల్, మిరియాల జ్యోతి, జడ శివ, జ్యోతి శివ, రాంనగర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.









Comments