top of page

యూట్యూబ్ న్యూస్ చానెళ్లకు చెక్

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 27, 2021
  • 1 min read

యూట్యూబ్ న్యూస్ చానెళ్లకు చెక్.


ప్రసారాలపై కఠిన చర్యలు


ఇక రాష్ట్ర ఐటీ శాఖ పర్యవేక్షన


రాష్ట్రంలోని యూట్యూబ్‌ వార్తా చానెళ్లకు ముకుతాడు పడనుంది. అడ్డూఅదుపూ లేకుండా యూట్యూబ్‌ చానెళ్లు చేస్తున్న అభ్యంతరకర ప్రసారాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారం చేయడం, మతాలు, కులాల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు కొందరిని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న చానెళ్లను నియంత్రించాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ మనవడిపై ఓ యూట్యూబ్‌ చానెల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖ కసరత్తు ప్రారంభించింది.


కేంద్ర మార్గదర్శకాలు పాటించాల్సిందే..


సోషల్‌ మీడియా పోస్టింగులు, న్యూస్‌ చానెళ్ల కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్‌ అండ్‌ డిజిటల్‌ మీడియా ఎతిక్స్‌ కోడ్‌) రూల్స్‌- 2021ను ప్రకటించింది. దీనిప్రకారం యూట్యూబ్‌, ఇతర ఆన్‌లైన్‌ న్యూస్‌ చానెళ్లలో అసత్య, విద్వేషపూరిత వార్తలు ప్రసారం చేస్తే సంబంధిత చానెళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రసారాలపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం, వాటిని గరిష్ఠంగా 15 రోజుల్లోపు పరిష్కరించడం చానెళ్ల బాధ్యత. రాష్ట్రంలో దాదాపు 200 వరకు యూట్యూబ్‌ వార్తా చానెళ్లున్నాయి. ఈ నిబంధనలను అన్ని యూట్యూబ్‌ న్యూస్‌ చానెళ్లు కచ్చితంగా పాటించేలా చూసేందుకు ఐటీశాఖ త్వరలో వారితో సమావేశం ఏర్పాటు చేయనుంది. ప్రజల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రతి చానెల్‌ తప్పనిసరిగా కార్యాలయ చిరునామా, ప్రతినిధి పేరు, ఫోన్‌ నంబర్లను ప్రదర్శించాల్సి ఉంటుందని ఐటీ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. జర్నలిజంపై ఏమాత్రం అవగాహన లేని వారు సైతం యూట్యూబ్‌ చానెళ్లను నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల గురించి వారికి తెలియదని పేర్కొన్నారు. త్వరలో చానెళ్ల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనలు వివరిస్తామని తెలిపారు. అయినప్పటికీ నిబంధనలను పాటించని చానెళ్లకు యూట్యూబ్‌ నుంచి చెల్లింపులు రాకుండా అడ్డుకుంటామని, ఆ తర్వాత చానెల్‌ను రద్దుచేయాలని ప్రభుత్వం తరఫున యూట్యూబ్‌ను కోరతామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని యూట్యూబ్‌ చానెళ్లన్నీ కేంద్ర మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలంటూ సోమవారం యూట్యూబ్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page