సాగర్ కాలువలోకి దూకుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి కారు
- PRASANNA ANDHRA

- Jan 12, 2022
- 1 min read
గుంటూరు జిల్లా, సంక్రాంతి పండగ వేళ వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. ఆయన బాబాయి సుందరరామిరెడ్డి కుమారుడు మదన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మదన్ మోహన్ రెడ్డి క్షేమంగా బయటపడగా ఆయన భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష చనిపోయారు.
అర్ధరాత్రి తర్వాత వీరి మృతదేహాలు బయటపడ్డాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో షాపింగ్ కోసం మదన్ మోహన్ రెడ్డి తన భార్యా కుమార్తెతో కలిసి విజయవాడకు వెళ్లారు. విజయవాడలో షాపింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో అడిగొప్పల దాటిన తర్వాత వీరి కారు ప్రమాదానికి గురయింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో కారు అదుపు తప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మదన్ మోహన్ రెడ్డి విండ్ నుంచి బయటకు వచ్చి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం పోలీసులు, బంధువులకు సమాచారం ఇచ్చారు.








Comments