మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి
- EDITOR

- Mar 7, 2023
- 1 min read
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - ఎస్సై లక్ష్మీప్రసాద్ రెడ్డి

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
మన రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కల్పించే అనేక చట్టాలు ఉన్నాయని.. వాటి గురించి మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాజంపేట పట్టణ ఎస్సై వి.లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. మహిళా దినోత్సవం వారోత్సవాలలో భాగంగా మహిళా సాధికారిత విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో మహిళలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని, వారికి మరింత ప్రోత్సాహం అందించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.పురుషోత్తమ్ మాట్లాడుతూ మహిళా విద్యార్థులు సిగ్గు, బిడియం వదిలి పురుషులతో ధీటుగా అన్ని విషయాలలో ముందంజలో ఉండాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా పరిపుష్టి పొంది సాధికారత కలిగి ఉండాలన్నారు.

ఈ సందర్భంగా మహిళా సాధికారత విభాగం కో ఆర్డినేటర్, హిందీ అధ్యాపకురాలు వి.పార్వతి మాట్లాడుతూ కొన్ని యధార్థ సంఘటనలు ఉదహరిస్తూ స్త్రీలకు చదువు మాత్రమే సరిపోదని.. ధైర్యం, తెగువ కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








Comments