కోర్టు చోరీ కేసులో సుమోటో పిల్ స్వీకరించిన ఏపీ హైకోర్టు
- PRASANNA ANDHRA

- Apr 26, 2022
- 1 min read
నెల్లూరు కోర్టు (వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న) కోర్టు చోరీ కేసులో సుమోటో పిల్ స్వీకరించిన ఏపీ హైకోర్టు.
వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనను ఏపీ హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని సుమోటో పిల్‌గా పరిగణించింది. మొత్తం 18 మందిని ప్రతివాదులుగా పేర్కొంది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, సీబీఐ డైరెక్టర్, నెల్లూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, చిన్న బజార్ ఠాణా ఎస్‌హెచ్‌వో, నెల్లూరు (గ్రామీణ) ఠాణా ఎస్‌హెచ్‌వో, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్), నెల్లూరు జిల్లా జడ్జి (పీడీజే), నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి, పసుపులేటి చిరంజీవి, టి.వెంకటకృష్ణ, జి.హరిహరన్, ఫిర్యాదిదారు (న్యాయస్థానంలో జూనియర్ అసిస్టెంట్) బచ్చలకూర నాగేశ్వరరావు ప్రతివాదులుగా ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిల్‌పై విచారణ జరపనుంది.








Comments