ఎంవిఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- PRASANNA ANDHRA

- Sep 30, 2022
- 2 min read
Updated: Oct 1, 2022
డా.ఎంవిఆర్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు సెప్టెంబర్ 30
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ డాక్టర్ ఎంవీ రమణా రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా రాయలసీమ కాలేజీ అఫ్ ఫీజికల్ ఎడ్యుకేషన్ ప్రాంగణం నందు ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామ కృష్ణ రెడ్డి, కడప ఎంపి అవినాష్ రెడ్డిలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, భూమన్, ప్రొద్దుటూరు మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మి దేవి, ఎంవీఆర్ కుటుంభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ...
భిన్నత్వం, వైవిధ్యం ఎంవిఆర్ సొంతం - సజ్జల
ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యమకారుడిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా ఎంవిఆర్ కడప జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకున్నారని, నాటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలను ఎదుర్కొని ఎవరికి మింగుడు పడని నాయకునిగా ఎదిగారని, భిన్నత్వం, వైవిధ్యం గల ఎంవిఆర్ ఇక్కడి ప్రజల గుండెల్లో సుస్థిర శాశ్విత స్థానం సంపాదించారని, నాటి ఎన్టీఆర్ టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి రైతు సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన ఘనత ఎంవిఆర్ కె దక్కుతుందన్నారు. రాబోవు తరాలకు ఎంవిఆర్ జీవితం ఆదర్శం అని ఆయన కొనియాడారు. ఆర్టీపీపీ ధర్మల్ విదుత్ కేంద్రానికి ఎంవిఆర్ పేరు పెట్టె లాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎంవిఆర్ స్మారక సంచిక (జీవిత చరిత్ర) ను ఆయన ఆవిష్కరించారు.
రైతు పక్షపాతి ఎంవిఆర్ - అవినాష్ రెడ్డి
తాను రాజకీయాలలో క్రొత్తగా ప్రవేశించిన నాడు ఎంవిఆర్ తనకు రాజకీయ సలహాలు సూచనలు చేశారని 2012లో తాను మొదటిసారి ఎంవిఆర్ ని కలిసినప్పుడు తనకు రాయలసీమ కన్నీటి గాధలు అనే పుస్తకాన్ని బహూకరించి, రైతులు, రైతు సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన పెంచుకొని, నదీ జలాల సద్వినియోగం ఇరిగేషన్ సంబంధిత శాఖలపై పట్టు సారించి రైతుల పక్షాణ నిలిచి తగు న్యాయం చేయమని అన్నారని అవినాష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలు డాక్టర్ ఎంవిఆర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు.
అన్ననై ఎంవిఆర్ బిడ్డల పక్షాణ నిలుస్తా - రాచమల్లు
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తాను వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినా రెండు దపాలు ఎంవిఆర్ తో ఓటు వేయించుకో గలిగానని, ఇది తాను అదృష్టంగా భావిస్తున్నానన్నారు. వైసీపీ పార్టీ స్థాపన నుండి ఎంవిఆర్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచారని, అందువలనే ఎంవిఆర్ మరణానంతరం ఆయన కోడలు మల్లెల ఝాన్సీ కి ఆప్కోబ్ చైర్మన్ పదవి సీఎం జగన్ అప్పగించి సముచిత స్థానం గౌరవం కల్పించారన్నారు. రాజీపడని ప్రయాణికుడు ఎంవిఆర్ అని, గెలుపు ఓటములు ఒకటిగా స్వీకరించే బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. రాబోవు రోజుల్లో కూడా ఎంవిఆర్ తనయులకు అన్ననై వారితో రాజకీయ ప్రయాణం చేస్తానని హామీనిచ్చారు.
చిన్ననాటి స్నేహం మాది - రఘురామి రెడ్డి
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ఎంవిఆర్ తో తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు, తామిద్దరం చిన్ననాటి స్నేహితులమని అన్నతమ్ముల వలె కలిసిమెలిసి ట్యూషన్లకు వెళ్లి వచ్చేవారమని, కాగా ఎంవిఆర్ మెడిసిన్ పూర్తి చేసి కార్మిక ఉద్యమం వైపు ద్రుష్టి మరల్చారని, 1983 ఎన్నికల్లో మొట్టమొదటిసారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి గెలుపొందారని, నాడు ఎన్టీఆర్ తో విభేదించి రాయసీమ విమోచన సమితి ని స్థాపించారని, 1984లో ప్రభుత్వంలో ఉంటూనే ప్రభుత్వ విధి విధానాలపై రైతులకు కార్మికులకు కర్షకులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ హోమస్ పేట నందు దాదాపు ఇరవై ఒక్క రోజులు నిరాహార దీక్ష చేశారని గుర్తు చేసుకున్నారు.
ఎంవిఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి - ఆకేపాటి
రాయలసీమ కార్మిక విమోచన సమితిని స్థాపించి, కార్మికుల సమస్యలపై పోరాడిన ఎంవిఆర్ చిరస్మరణీయుడని, నేడు వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి అని, ఎంవిఆర్ ఆశయాలను ముందుకు తీసుకునివెళ్ళాలని ఆకేపాటి అన్నారు.
అనంతరం పలువురు నాయకులు వక్తలు ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని, అనుబంధాన్ని, రాజకీయ సంబంధాలని గుర్తు చేసుకొని, ఎంవిఆర్ ఒక రాజాకీయ నాయకుడిగానే కాక సాహిత్యం, కధలు, వ్యాకరణం, సినిమా విశ్లేషణ, కథా రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయనను అభివర్ణించారు. కార్యక్రమంలో ఎంవిఆర్ అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.








Comments