ప్రజాసమస్యలు తీర్చడం లో అధికారులు ముందుండాలి ప్రభుత్వ విప్ కొరముట్ల.
- DORA SWAMY

- Jun 13, 2022
- 2 min read
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించండి.
--చిట్వేలు మండల సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ కొరముట్ల.

అన్నమయ్య జిల్లా చిట్వేలు నందు మండల సర్వసభ్య సమావేశం ఈరోజు మధ్యాహ్నం ఎంపీపీ చంద్ర అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డిలు హాజరయ్యారు.

శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ప్రజలకు అందే సంక్షేమ ఫలాలు, మా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల తేడాను ప్రతి ఒక్కరూ గమనించాలని; మా ప్రభుత్వ పురోగతి అందరికీ అర్థం అవుతుందని పేర్కొన్నారు. గత 40 ఏళ్లుగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కరించడం అసాధ్యమని క్రమక్రమంగా వాటిని అధిగమిస్తామని అన్నారు.రాజుకుంట క్రాస్, రాచపల్లి తదితర చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలను త్వరలోనే చేపడతామన్నారు.
కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు, ప్రతినిధులు సచివాలయ వ్యవస్థ పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో ప్రధాన పాత్ర వహించాలన్నారు.

వాడివేడిగా ప్రారంభమైన ఈ సమావేశంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల ప్రతినిధులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. సమస్యలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి తీరడం లేదని కొందరు ప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకే కాక అభివృద్ధిలోనూ, ప్రజల మూకుమ్మడి శాశ్విత అవసరాల లోనూ దృష్టి సారించాలని సభా ముఖానికి తెలియపరిచారు. అజెండాలో చేర్చేందుకు సమస్యలను ప్రధానత ఇచ్చి సమస్యలను తీర్చాలని అన్నారు.
తదుపరి వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని అబివృద్ధి వివరాలు చేపడుతున్న పనుల గురించి వివరణ ఇచ్చారు. పెద్దలకు కరోనా బూస్టర్ డోసు, చిన్న పిల్లలకు రెండవ డోసు, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత తదితర విషయాలపై మండల ఆరోగ్య అధికారి శివ ప్రసాద్ గౌడ్ వివరించగా; మండలంలోని రేషన్,భూ సమస్యల గురించి డిప్యూటీ తాసిల్దార్ మురళీకృష్ణ మాట్లాడుతూ .. భూముల రీ సర్వే లో పనులు వేగవంతం చేశామని తద్వారా రైతులకు శాశ్వత లబ్ధి చేకూరుతుందని దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తామని పేర్కొన్నారు.
మండల వ్యవసాయ అధికారి రాజకుమారి మాట్లాడుతూ రైతులు తమ సాగు చేసే ప్రతి పంటకు ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకోవాలని ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా అందిస్తున్నామని ఈ పద్ధతిని ఉపయోగించుకోవడం వల్ల ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు పంట బీమా రైతులకు అందుతుందని ఈ కోవలోనే మండల వ్యాప్తంగా పసుపు పంట లో నష్టపోయిన 48 మంది లబ్ధిదారులకు సుమారు 13 లక్షలు నగదు చేకూరిందని ఉద్యాన పంటలైన డ్రాగన్ ఫ్రూట్, ఎదరు తదితర పంటలు సాగుకు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందని విరివిగా ఉపయోగించుకోవాలన్నారు.
గృహ నిర్మాణ అధికారులు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా జగనన్న గృహ నిర్మాణ దారులు తమ ఇంటిని నిర్మించుకునేందుకు తామే ముందుకు రావాలని కావలసిన సామాగ్రిని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ అధికారి బాలాజీ మాట్లాడుతూ మోటర్లకు మీటర్ల బిగించడం లో ఎలాంటి ఇబ్బంది ఉండదని కేవలం లబ్ధిదారులయిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిన మొత్తాన్ని తిరిగి విద్యుత్ అధికారులు పొందడం జరుగుతుందని.. ఈ విషయంలో రైతులందరూ విరివిగా విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు. త్వరలోనే విద్యుత్తు సప్లై లో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తామన్నారు.
ఉపాధి,శిశు సంక్షేమ,రోడ్లు భవనాలు, విద్యుత్తు తదితర అధికారులు తమ శాఖ పరిధిలోని చేపట్టే పనుల గురించి ప్రతినిధులు అడిగిన సమస్యలకు సమాధానమిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, ఉప ఎంపిపి సుబ్రహ్మణ్యం రెడ్డి, మండల ప్రాదేశిక సభ్యులు, సర్పంచులు,మండల అభివృద్ధి అధికారి సమత, డిప్యూటీ తాసిల్దార్ మురళీకృష్ణ, సిఐ విశ్వనాథ్ రెడ్డి, మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








Comments