ప్రొద్దుటూరు జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ – 300కు పైగా కేసులు పరిష్కారం
- PRASANNA ANDHRA

- 6 minutes ago
- 1 min read
ప్రొద్దుటూరు జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ – 300కు పైగా కేసులు పరిష్కారం
ప్రొద్దుటూరు
కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా కోర్టు ఆవరణలో ఈరోజు మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్ కార్యక్రమాల్లో భాగంగా ఈ మెగా లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 300కు పైగా కేసులు ఇరు పక్షాల సమ్మతితో పరిష్కరించినట్లు జిల్లా న్యాయమూర్తి తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో న్యాయం అందుతోందని పేర్కొన్నారు.

లోక్ అదాలత్‌లో ముఖ్యంగా మోటారు వాహన ప్రమాద కేసులు, చెక్కులు బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, చిన్నపాటి సివిల్ కేసులు పరిష్కరించేందుకు అవకాశం కల్పించారని న్యాయమూర్తి వివరించారు. ఈ విధానంలో ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించడంతో పాటు, కేసులు పూర్తిగా ముగిసినవిగా పరిగణిస్తారని తెలిపారు. పూర్వకాలంలో ఉన్న రచ్చబండ పంచాయతీ విధానాన్ని ఆధునిక న్యాయపద్ధతిలో అమలు చేస్తున్న రూపమే లోక్ అదాలత్ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహిళల కేసుల్లో కౌన్సిలింగ్ అనంతరం పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కారమైతే తిరిగి అప్పీలు అవకాశం ఉండదని, తద్వారా ప్రజలకు శాశ్వత న్యాయం లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు ముందుగానే తమ కేసులను లోక్ అదాలత్‌కు రిఫర్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ మెగా లోక్ అదాలత్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, న్యాయాధికారులు, కక్షిదారులు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








Comments