top of page

గర్భవతని 9 నెలలు ట్రీట్‌మెంట్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Sep 21, 2022
  • 1 min read

ఠాగూర్ మువీకి మించిన సస్పెన్స్!

గర్భవతని 9 నెలలు ట్రీట్‌మెంట్...

తీరా డెలివరీకి వెళ్తే కడుపులోనే మాయమైన బిడ్డ

ree

మెగాస్టార్ ఠాగూర్ సినిమాలో డబ్బు కోసం మృతదేహానికి డాక్టర్లు వైద్యం చేసినట్లు మాంచి రసవత్తరమైన నాటకాన్ని ఆడుతారు. గుర్తుందా.. అలాంటి నాటకమే ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో రిపీట్ చేశారు వైద్యులు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన మహిళకు గర్భవతని చెప్పి, 9 నెలల పాటు చికిత్స అందించారు. ఈ క్రమంలో పొట్ట పెదిగేందుకు నకిలీ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. తీరా డెలివరీకి టైంకి ఆసుపత్రికి వస్తే నువ్వసలు ప్రెగ్నెంటేకాదని ప్లేటు ఫిరాయించారు. డబ్బు కోసం వైద్యులు ఆడిన దొంగ ట్రీట్‌మెంట్‌ నాటకం స్థానికంగా కలకలం రేపింది.

కాకినాడలో చోటు చేసుకున్న ఈ వింత సంఘటన మంగళవారం (సెప్టెంబర్‌ 20) వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి సత్యనారాయణతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ ఏడాది జనవరిలో వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తన భార్యను సత్యనారాయణ తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యులు మహాలక్ష్మి గర్భవతి అని తెలిపారు. 9 నెలల వరకు ఆమెకు పరీక్షలు కూడా నిర్వహించారు. వచ్చిన ప్రతిసారి డాక్టర్లు స్కానింగ్‌ చేసి, మందులు రాసిచ్చేవారు. ఈ క్రమంలో ఆరో నెలలో స్కానింగ్‌ చేసి ప్రసవం తేదీని ఖరారు చేశారు. సెప్టెంబరు 22న డెలివరీ అవుతుందని తెలిపారు.

దీంతో పురుడు కోసం మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు స్కానింగ్‌ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఖంగు తిన్నారు. అసలు మహాలక్ష్మి గర్భవతే కాదని తేల్చి చెప్పారు. దీంతో అయోమయానికి గురైన కుటుంబ సభ్యులు మహాలక్ష్మిని కాకినాడ రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చి స్కానింగ్‌ చేయించారు. ఆమె గర్భంలో శిశువు లేదని స్కానింగ్‌ చేసే వ్యక్తి చెప్పారు. బంధువులు వైద్యురాలిని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆపుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.తొమ్మిది నెలల నుంచి వైద్యం పేరుతో వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టించారు. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందంటూ ప్రతి నెలా మందులు రాసిచ్చారు. ఈ మందులను వాడటంతో తమ కుమార్తె పొట్ట పెద్దదైంది. డబ్బు కోసం ప్రాణాలతో ఆడుకునే ఇటువంటి బూటకపు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page