ప్రపంచవ్యాప్తంగా హిందువుల భద్రతకు చర్యలు తీసుకోవాలి – ఇర్ఫాన్ భాష
- PRASANNA ANDHRA

- 13 minutes ago
- 1 min read
ప్రపంచవ్యాప్తంగా హిందువుల భద్రతకు చర్యలు తీసుకోవాలి – కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష

ప్రొద్దుటూరు | 23 డిసెంబర్ 2025
గత రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో హిందూ సోదరులపై అతి దారుణమైన, కిరాతకమైన దాడులు జరిగాయని, నడిరోడ్డుపై చితకబాది హత్య చేయడం అత్యంత బాధాకరమని ఇర్ఫాన్ భాషా తెలిపారు. నేడు ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ భాష మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్నా హిందువులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు ప్రధాని గానీ, కేంద్ర మంత్రులు గానీ స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఒకవైపు రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర దేశాలకు ప్రత్యేక ప్యాకేజీలు, వసతులు కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆరోపించారు. దేశంలో మైనారిటీలపై జరిగే ఘటనలపై మౌనం వహిస్తూ, విదేశాల్లో హిందువులపై జరుగుతున్న హింసపై కూడా ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. ప్రజలు దీని గురించి ఆలోచించాలని గమనించాలని కోరారు.
బాంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నప్పటికీ, ఆ దేశ రాజకీయ నాయకులకు భారత్‌లో భద్రత కల్పించడం రాచమర్యాదలు చేయడం ఎంత వరకు సమంజసం అని ఇర్ఫాన్ భాష ప్రశ్నించారు. హిందువుల రక్తం కారుతున్నప్పుడు స్పందించని కేంద్ర ప్రభుత్వం, రాజకీయ, దౌత్య ప్రయోజనాల కోసం మాత్రం అదే దేశాల నేతలకు గౌరవాలు కల్పించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని దేశాలతో చర్చలు జరిపి, హిందువులు, భారతీయులు మాత్రమే కాకుండా ఏ మతానికి చెందిన వారైనా సురక్షితంగా జీవించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోనే కాకుండా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా హిందువులకు ఇబ్బందులు కలగకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.








Comments