top of page

ఇదేమి చెన్నకేశవా!!!

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jul 26, 2022
  • 2 min read

Updated: Jul 27, 2022

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

స్థానిక పాత మార్కెట్ నందు వెలసిన అతి పురాతనమైన శ్రీ మహాలక్ష్మి సామెత చిన్న కేశవ స్వామి దేవస్థానం నందు అర్చకుల తొలగింపు వివాదం రాసాబసగా మారింది. వివరాల్లోకి వెళితే చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు గత నూటా ఇరవై సంవత్సరాలుగా వారసత్వ పౌరోహిత్యం ద్వారా సంక్రమించిన అర్చక విధులను నివహిస్తున్న వారిని కాదని ఈఓ నిన్నటి రోజున వారిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు, కాగా ఇది కాస్తా వివాదంగా మారింది. తాము వంశ పారంపర్యంగా ఇక్కడి చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు గౌరవ వేతనంతో అర్చక వృత్తిని కొనసాగిస్తున్నామని, కాగా నిన్నటి రోజున ఈఓ లిఖితపూర్వకంగా తమను విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయటం తమను ఎంతగానో బాధించిందని, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈఓ ఈ చర్యకు పాల్పడటం సబబు కాదని, తమను విధులనుండి తొలగించి వేరే వారిని దేవస్థాన అర్చకులుగా నియమించటం ఎంతవరకు సమంజసం అని, ఇదే జరిగితే తాము ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. నిన్నటి రోజున కొందరు వ్యక్తులు వచ్చి బలవంతంగా తమ దగ్గర దేవస్థాన తాళాలు తీసుకొని, నేటి ఉదయం నూతన అర్చకుడిని ఇక్కడ ఏర్పాటు చేసి తమను విధులకు రాకుండా అడ్డుకున్నారన్నారు. బాధిత అర్చకులు నేడు ఆలయంలోకి ప్రవేశించి తాళాలు వేయటం ఇక్కడ కొసమెరుపు.

దేవస్థాన అర్చకులు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆలయ ప్రాంగణానికి చేరుకొని వారికి జరిగిన అన్యాయాలన్ని అడిగి తెలుసుకున్నారు, అనంతరం కాసేపు ఆలయ ప్రాంగణంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించారు. విషయం తెలుసుకున్న రెండవ పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని బైఠాయించిన టీడీపీ నాయకులను నిరసన ఆపమని కోరగా కాసేపు టీడీపీ నాయకులకు పోలీసులకు వాగ్వివాదం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడి దేవస్థానానికి కొన్ని వొందల సంవత్సరాల చరిత్ర కలదని, కొన్ని తరాలుగా ఇక్కడ అర్చక వృత్తిని చేపట్టిన వారిని కాదని ఇతరులను అర్చకులుగా నియమించటం భావ్యం కాదని, అర్చకులపై ఆరోపణలు ఉంటే నోటీసులు ఇచ్చి ఎంక్వయిరీ చేయాలని, పోలీసులు రంగప్రవేశం చేసి తాళాలు ఈఓ కి అప్పచెప్పటం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై హై కోర్టు, మానవ హక్కుల సంఘానికి టీడీపీ పిర్యాదు చేయనున్నట్లు, తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల జోక్యంతో టీడీపీ నాయకులు భాదిత అర్చకులు రెండవ పట్టాణ పోలీసు స్టేషన్ కి వెళ్లి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా మీడియా ప్రతినిధులు ఆలయ ఈఓ ని పై విషయమై వివరణ కోరగా దాటివేత ధోరణి ప్రదర్శించి పలు రకాల సమాధానాలు ఇచ్చారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page