top of page

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం: చంద్రబాబు పవన్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Oct 18, 2022
  • 2 min read

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం: చంద్రబాబు పవన్

ree

విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో పవన్‌ కల్యాణ్‌ను కలిసిన అనంతరం ఇద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...

''ఎయిర్‌పోర్టు నుంచి వస్తూ పవన్‌ ఇక్కడున్నారని తెలిసి నేరుగా వచ్చా. ముందుగా ఎవరికీ చెప్పలేదు. పవన్‌ను కలిసి సంఘీభావం తెలిపేందుకే వచ్చా. నాగరిక ప్రపంచంలో, ప్రజాస్వామ్యంలో విశాఖలో జరిగిన తీరు చూస్తే బాధేస్తోంది. పవన్‌ కల్యాణ్ విశాఖలో కార్యక్రమం పెట్టుకునేందుకు వెళ్తే పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరం. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉన్మాది పాలనలో పైశాచిక ఆనందం కోసం తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు''

ree

''ఒక పోలీసు అధికారి వాహనం ఎక్కి నడిరోడ్డుపై పవన్‌ను నిలబెట్టే పరిస్థితి. దారి పొడవునా లైట్లు తీసి చీకట్లో పంపించారు. తప్పుడు కేసులు పెట్టి బెదిరించి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. వైకాపా వేధింపులు తాళలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు ప్రాధాన్యత లేదు. రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజా సమస్యలపై ఎవరు పోరాడతారు. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకాపా లాంటి నీచమైన పార్టీని ఎప్పుడూ చూడలేదు. జగన్‌ పైశాచిక ఆనందం శాశ్వతం కాదు''


కలిసి రావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరాం...


''విశాఖ ఘటన నేపథ్యంలో మనసు బాధపడి తప్పకుండా పవన్‌ను కలిసి సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చా. తెదేపా కార్యాలయంపై దాడి చేసి మాపైనే కేసులు పెట్టారు. ఇంత కన్నా దారుణం ఇంకేమైనా ఉంటుందా? ముందు రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకుందాం. ఆ తర్వాత ప్రజాసమస్యలపై పోరాడుదాం. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలను కలిసి చర్చిస్తాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మా కర్తవ్యం. కొంతమంది పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కలిసి రావాలని పవన్‌ కల్యాణ్‌ను కోరాం. బయటకు వచ్చి మాట్లాడే స్వేచ్ఛ ఎవరికైనా ఉందా? సమస్యలపై ధైర్యంగా చెప్పుకొనే పరిస్థితి ఎవరికీ లేదు'' అని చంద్రబాబు అన్నారు..


ఎవరెలా పోటీ చేస్తారో పరిస్థితిని బట్టి ఉంటుంది..


''ముందుగా ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యం.. ఆ తర్వాత ఎవరెలా పోటీ చేస్తారో అప్పటి పరిస్థితి బట్టి ఉంటుంది. మీడియాకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉందా? ఆడబిడ్డలకు రక్షణలేదు. ఇన్నాళ్లు రాజకీయం చేసిన నేనే ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించారు. అన్యాయానికి గురైన కౌలు రైతులకు ఆర్థిక సాయం చేసే స్వేచ్ఛ పవన్‌కు లేదా? ఆయన రాష్ట్రానికి పౌరుడు కాదా? విశాఖ వెళ్లకూడదా? ప్రభుత్వమే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ .. తిరిగి ప్రతిపక్షంపైనే కేసులు పెడతారా? రాజకీయ నేతలకే రక్షణ లేకుంటే.. సామాన్యులకు ఏది. మనుషులను నిర్వీర్యం చేసేందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పవన్‌ కల్యాణ్‌కు తిట్లు తినే అలవాటు లేదు.. రాజకీయాల్లోకి వచ్చి తిట్లు తింటున్నారు. ఇప్పుడు పవన్‌ బరస్ట్‌ అయ్యారు. వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజును అరెస్టు చేసినప్పుడు నేనే స్పందించా. లేకుంటే ఆరోజు రఘురామను చంపేసేవారు'' అని చంద్రబాబు అన్నారు..


ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: పవన్‌ కల్యాణ్‌...


''విశాఖలో జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న క్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఫోన్‌ చేసి సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు. రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తులను నలిపేస్తామంటే ఎలా? తెదేపా, జనసేనకే కాదు.. మా మిత్రపక్షమైన భాజపాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది. ఎన్నికల గురించి మాట్లాడాల్సిన సమయం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయమిది. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయం ఒక్కరోజులో తేలేది కాదు. వైకాపాతో పోరాటం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ముందుగా న్యాయ, రాజకీయ పోరాటం చేస్తాం. అంతిమంగా ప్రజలకు మేలు చేయడమే మా ఉద్దేశం'' అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page