top of page

నేడు హలో నిరుద్యోగి చలో కలెక్టరేట్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 10, 2022
  • 1 min read

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు బర్తిచేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి 62 సంవత్సరాల నుండి 58 సంవత్సరాలకు కుదించాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నేడు జరగనున్న చలో కలెక్టరేట్ నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని SFI జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్, DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్, AISF జిల్లా కార్యదర్శి వలరాజు, AIYF జిల్లా కార్యదర్శి బాలు, NSUI రాష్ట్ర కార్యదర్శి తిరుమలేసు, TNSF జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సుధీర్, తెలుగు యువత నాయకులు జియావుద్దీన్, RVS రాష్ట్ర కార్యదర్శి జగదీష్ లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని, గ్రూప్ 1,2,3 పోస్టుల సంఖ్య పెంచాలని, 6500 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, 25 వేల టీచర్ పోస్టులు భర్తీ కోసం చర్యలుతీసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచడం అన్యాయమని, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం సిగ్గుచేటని వారు అన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని, "నేను ఉన్నాను, నేను విన్నాను" ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయడం లేదని వారు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు పెంచడం సిగ్గుచేటని వెంటనే గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల కలెక్టరేట్ల దగ్గర నిరుద్యోగులతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా కడప కలెక్టరేట్ ఎదుట విద్యార్థి, నిరుద్యోగులతో కలిసి ఆందోళనలు నిర్వహించనున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరగనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని అడ్డుకుందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారని, శాంతియుతంగా జరగనున్న నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సరి కాదని వారు అన్నారు. ఇప్పటికన రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page