top of page

ఉత్తుత్తి హామీలతో అధికారంలోకి జగన్

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 1, 2023
  • 2 min read

ఉత్తుత్తి హామీలతో అధికారంలోకి జగన్

ree

మద్యపాన నిషేధం చేసే దమ్ముందా - సవాల్ విసిరిన బత్యాల


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


ఉత్తుత్తి హామీలతో ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి బత్యాల చెంగలరాయుడు ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 85 శాతం హామీలను నెరవేర్చామని, మిగిలిన 15 శాతం హామీలు కూడా అతి త్వరలోనే పూర్తి చేస్తామని విజయవాడలో మీడియా సమావేశంలో జగన్ రెడ్డి వెల్లడించడం హాస్యాస్పదమని అన్నారు. టిడిపి అధికారంలో ఉంటే కరువుకాటకాలు, తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సకాల వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు.

ree

జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే కరోనాతో ప్రపంచమే కకావికలమైందని గుర్తు చేశారు. కరోనాతో రెండేళ్ల లాక్ డౌన్ కారణంగా ప్రకృతిలో కాలుష్యం తగ్గి వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. వానలు సమృద్ధిగా ఉన్నా ఏ డ్యామ్ కింద ఏ రైతు పంటలు వేశారో జగన్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. ఎరువులు, పైపులు అధిక ధరలతోనూ, రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతోనూ ఏ రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు రావడంలేదని అన్నారు. అందరి కడుపులు నింపే రైతు కడుపు కొట్టిన దరిద్రమైన ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సమయానికి వేతనాలు అందక వారు ఉప్పు, పప్పు, వైద్యానికి అప్పులు చేసుకుంటున్నారని అన్నారు. కాంట్రాక్టర్లకు 35 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వారు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ప్రతి పేదవాడికి రూ 5 లక్షలతో ఇంటి నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చి మడమ తిప్పి గృహ నిర్మాణ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ 1.80 లక్షలు తోనే ఇళ్లు నిర్మించుకోవాలని ప్రజలపై ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. సిమెంటు, స్టీలు, ఇసుక ధరలు పెరగడంతోనూ మేస్త్రి, ప్లంబర్ కూలీలు నాలుగు రెట్లు పెరగడంతోనూ పేదవారు ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నారని., ఐనా జగన్ రెడ్డి ఇసుక, కంకర కు రూ వేయి లు రాయల్టీ విధించి ప్రైవేటు పరం చేశారని విమర్శించారు.

ree

గతంలో టిడిపి ప్రభుత్వంలో ఇసుకను ఉచితంగా అందజేశామని గుర్తు చేశారు. టిడిపి హయాంలో హిందువులు, మైనారిటీలు, క్రైస్తవులకు పండుగ కానుకలు అందజేసేవారని, జగన్ రెడ్డి వాటిని కూడా దిగమింగాడని ఆరోపించారు. పేదలకు ఆసరాగా నిలిచే కళ్యాణమస్తు పథకానికి పదవ తరగతి అర్హత నిబంధనతో అనేకమంది పథకానికి నోచుకోకుండా పోతున్నారని తెలిపారు. చదువుకోని వారు పెళ్లిళ్లు చేసుకోరా అని ప్రశ్నించారు. పల్లెలు, పట్టణాలలో అభివృద్ధి అగమ్య గోచరంగా మారిందని అన్నారు. సర్పంచులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత వైసీపీ దేనని అన్నారు. జగన్ రెడ్డికి కడప బిడ్డడి పౌరుషం ఉంటే మద్యపాన నిషేధం చేసి నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page