పంచాయితీగా అమృత నగర్! సంతకాల సేకరణ పూర్తి...?
- PRASANNA ANDHRA

- 4 hours ago
- 2 min read
పంచాయితీగా అమృత నగర్! సంతకాల సేకరణ పూర్తి...?

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశి భూషణ్ కుమార్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీల విభజన మరియు పునర్వ్యవస్థీకరణ ఆదేశాల నేపథ్యంలో, ఈనెల 1వ తారీఖున జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి ఉత్తర్వులు మేరకు, పలు పంచాయతీలలో విలీనమై ఉన్న గ్రామాలు నూతన పంచాయతీలుగా గుర్తింపు పొందడానికి పలు సూచనలు చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో, ప్రొద్దుటూరు మండలంలో మేజర్ పంచాయతీ అయిన కొత్తపల్లి పరిధిలోని అమృత నగర్ వాసులు అమృత నగర్ పంచాయతీ గా పరిగణించాలని ప్రభుత్వ నూతన ఉత్తర్వుల మేరకు అమృత నగర్ అన్ని విధాల నూతన పంచాయితీగా గుర్తించబడడానికి ఏర్పడటానికి జనాభా నిష్పత్తి, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ పాఠశాలలు, సచివాలయాలు కలిగి ఉన్నదని, గతంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి అలాగే కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డికి వినతి పత్రం ఇచ్చి ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెలలో కొత్తపల్లి పంచాయతీ కార్యాలయంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశం నందు మెజారిటీ సభ్యులు అమృత నగర్ ను నూతన పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరగా, అందుకు తగిన తీర్మానాన్ని సర్పంచ్ కొన్నిరెడ్డి ఆదేశాల మేరకు సెక్రెటరీ నరసింహులు రూపొందించారు. ఇదిలా ఉండగా నాలుగు గోడల మధ్య చేసిన తీర్మానం ఇక్కడ అమృత నగర్ ప్రజలకు తెలియదని ఓ వ్యక్తి జిల్లా కార్యాలయం నందు ఫిర్యాదు చేయగా, బుధవారం ఉదయం అమృత నగర్ లోని సచివాలయ వెలుపల గ్రామసభ నిర్వహించి అమృత నగర్ వాసుల నుండి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రజలు వారి అభిప్రాయాన్ని సంతకాల ద్వారా తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, అమృత నగర్ ను పంచాయితీగా గుర్తించాలని ఇక్కడ ప్రజలు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డికి అలాగే తనకు వినతి పత్రాన్ని అందించారని, ఇందుకోసం గడచిన సర్వసభ్య సమావేశం నందు మెజారిటీ సభ్యులు కోరిన నేపథ్యంలో నేడు అమృత నగర్ నందు సంతకాల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని, ఇక్కడి ప్రజలకు తాను ఎంతగానో సేవలు చేశానని గుర్తు చేస్తూ, కొత్తపల్లె పంచాయితీలో అమృత నగర్ ఒక భాగమని, ఇక్కడి ప్రజలకు కష్టనష్టాలలో తాను ఎల్లవేళలా ఉన్నానని, రానున్న రోజులలో కూడా ప్రభుత్వం నిర్ణయానుసారంగా తాను నడుచుకుంటూ ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. కొందరు స్వార్థపరులు కొత్తపల్లి పంచాయతీ నుండి అమృత నగర్ ను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని, ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నరసింహులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, అమృత నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments